ఇవి కాకినాడ కాజా మరియు మడత కాజా లాగా కాకుండా చాల సులువుగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు :
మైదా పిండి : అర కిలో
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి తగినంత
బెల్లం లేదా పంచదార: అర కిలో
తయారు చేసే విధానం:
వీటిని పాకం పట్టుకోవచ్చు లేదా ఉప్పు కారం వేసి కమ్మగా చేసుకోవచ్చు. స్వీటు హాటు కూడా చేసుకోవచ్చన్నమాట. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కమ్మటి వాటికైతే ఉప్పు కలపాలి, తీపి వాటికి అక్కరలేదు. మైదా పిండిలో కొంచెం ( నాలుగు అయిదు స్పూన్లు) కాచిన నూనె కలుపుకోవాలి. అప్పుడు కాజాలు గుల్లగా వస్తాయి. తరువాత తగినన్ని నీరు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు చేసి పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి.
ఆ చపాతీని ముందు నిలువుగా తరువాత అడ్డంగా చాకుతో కోసుకోవాలి డైమెండ్ ఆకారం లో .
ఇప్పుడు అలా కోసిన వాటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వత్తి , కోసి వేయించుకోవాలి. కమ్మటివి కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఆ కాజాల మీద చల్లుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు. తియ్యటివి కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ముదురు పాకం పట్టి అందులో వేయించిన కాజాలు వేసి బాగా కలుపుకోవాలి , పాకం అన్ని కాజాలకి పట్టేలాగా . చల్లారిన తరువాత ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి.
No comments:
Post a Comment